Latest News

దాగుడుమూత దండాకోర్‌ మూవీ రివ్యూ
by MTW - 0

బ్యానర్ : ఉషాకిరణ్‌ మూవీస్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌

మూవీ : దాగుడుమూత దండాకోర్‌

నటీనటులు : డా॥ రాజేంద్రప్రసాద్‌, సారా అర్జున్‌ , సిద్ధార్థ్‌వర్మ , నిత్యశెట్టి , రవిప్రకాష్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ : వి.ఎస్‌.జ్ఞానశేఖర్‌

సంగీతం : ఇ.ఎస్‌.మూర్తి 

కథ : ఎ.ఎల్‌.విజయ్‌

మాటలు : పెద్దింటి అశోక్‌కుమార్‌

ఎడిటింగ్‌ : ధర్మేంద్ర కాకరాల

సమర్పణ : క్రిష్‌

నిర్మాత : రామోజీరావు

దర్శకత్వం : ఆర్‌.కె.మలినేని

విడుదల తేదీ : 09.05.2015

ఒక భాషలో సూపర్‌హిట్‌ అయిన సినిమాలు రీమేక్‌ చెయ్యడం వల్ల మరో భాషలో రీమేక్‌ చెయ్యడం వల్ల సూపర్‌హిట్‌ అవుతాయన్న గ్యారెంటీ లేదని గతంలో చాలా సినిమాలు నిరూపించాయి. తమిళంలో ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘శైవమ్‌’ చిత్రాన్ని ఉషాకిరణ్‌ మూవీస్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నాయి. పూర్తి గ్రామీణ వాతావరణంలో, చక్కని కుటుంబ నేపథ్యంలో ‘దాగుడుమూత దండాకోర్‌’ పేరుతో తెలుగులో రూపొందిన ఈ చిత్రం ఎంతవరకు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది? ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఈ సినిమా థియేటర్స్‌కి రప్పించగలదా? తమిళ్‌లో వర్కవుట్‌ అయిన కోడి సెంటిమెంట్‌ తెలుగులోనూ వర్కవుట్‌ అయిందా? అనే విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం.

కథ : అది రాజులపాలెం. ఆ ఊరి పెద్ద రాజుగారు(రాజేంద్రప్రసాద్‌) అంటే అందరికీ గౌరవమే. ఆయన మనవరాలు బంగారం(సారా అర్జున్‌). బంగారంకి తమ ఇంట్లో మూడేళ్ళుగా పెరుగుతున్న నాని(కోడి) అంటే ప్రాణం. ఇదిలా వుంటే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా వేరే ఊళ్ళలో వున్న కొడుకులు, కూతురు మూడేళ్ళ తర్వాత పోలేరమ్మ జాతరకు ఆ పల్లెటూరికి వస్తారు. మూడేళ్ల తర్వాత కలిసిన కుటుంబ సభ్యులంతా ఆనందంగా వుంటారు. ఒకరోజు గుడిలో పూజ చేయించడానికి వెళ్ళిన వారికి ఒక అశుభం ఎదురవుతుంది. పూజా సామాగ్రి వున్న పళ్ళెంలో బల్లి కనిపిస్తుంది. అది అశుభానికి సంకేతం అనీ, అమ్మవారికి ఏదైనా మొక్కుకొని ఆ మొక్కు తీర్చకపోతేనే అలా జరుగుతుందని, దాని వల్ల కుటుంబానికి అరిష్టం అని పూజారి చెప్తాడు. ఓ సందర్భంలో అమ్మవారికి కోడిని బలి ఇస్తామని ఆ కుటుంబ సభ్యులు మొక్కుకుంటారు. అప్పుడే కోడిని ఇంటికి తెస్తారు. మొక్కు తీర్చుకునే టైమ్‌కి కుటుంబ సభ్యులంతా తమ పనుల మీద ఊళ్ళకి వెళ్ళిపోవడంతో ఆ కోడి అప్పటి నుంచి ఆ ఇంట్లోనే వుంటుంది. ఇప్పుడు అందరూ వున్నారు కాబట్టి పోలేరమ్మ జాతరలో కోడిని బలి ఇచ్చి శాంతి చేయాలని నిర్ణయించుకుంటారు కుటుంబ సభ్యులు. ఆ నిర్ణయం తీసుకున్న రోజు నుంచీ కోడి కనిపించకుండా పోతుంది. దాని కోసం అందరూ వెతుకుతూ వుంటారు. అసలు ఆ కోడి ఎక్కడికి వెళ్ళింది? అది కనపించకుండా పోవడం వెనుక ఎవరి ప్రమేయం వుంది? కోడిని బలి ఇవ్వాలని నిర్ణయించుకున్న రాజుగారు అప్పుడు ఏం చేశారు? చివరికి కోడి దొరికిందా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.

విశ్లేషణ : సినిమా ఫస్ట్‌ హాఫ్‌లో గ్రామీణ నేపథ్యం, అక్కడ జరిగే కొన్ని సరదా సంఘటనలతో బాగానే అనిపిస్తుంది. అలాగే ఊళ్ళ నుంచి వచ్చిన పిల్లలు చేసే అల్లరి, బావా మరదళ్ళ మధ్య చిన్న లవ్‌ ఎఫైర్‌, తాత, మనవరాలి మధ్య కొన్ని సెంటిమెంట్‌ సీన్స్‌, సరదాగా అనిపించే సీన్స్‌తో ఫస్ట్‌ హాఫ్‌ ఫర్వాలేదు అనిపించినా సెకండాఫ్‌కి వచ్చే సరికి నెక్స్‌ట్‌ ఏం జరగబోతోంది అనేది క్యూరియాసిటీ వుండదు. కోడి కనిపించడం లేదని అందరూ పదే పదే వెతికే సీన్స్‌ ఆడియన్స్‌కి బోర్‌ కొట్టిస్తాయి. డెఫినెట్‌గా కోడిని బలి ఇవ్వరు అని ఆడియన్స్‌ మైండ్‌లో ఫిక్స్‌ అయిపోయిన తర్వాత నెక్స్‌ట్‌ ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ వుండదు కదా. సినిమా చూసే ఆడియన్స్‌ కూడా ఇదే ఫీల్‌ అవుతారు. సినిమా అయితే హ్యాపీ ఎండిరగ్‌తోనే వుంటుంది అదేదో చూసేసి వెళ్ళిపోదాం అనుకుంటారు తప్ప మనం అనుకున్నది జరగలేదని నిరాశ పడరు. అయితే ఈ సినిమా ద్వారా ఇచ్చిన చక్కని సందేశం మాత్రం అందరికీ నచ్చుతుంది. దేవుడ్ని కోరికలు తీర్చమని అడుగుతాం, జంతువులను బలి ఇస్తామని కూడా మనమే చెప్తాం. కానీ, నాకు జంతుబలి కావాలని ఏ దేవుడూ, ఏ దేవతా అడగదని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. దానికి కథా రచయిత విజయ్‌ని, మంచి సందేశం వున్న చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చెయ్యాలనుకున్న నిర్మాతల్ని అభినందించాలి. ఫైనల్‌గా చెప్పాలంటే చక్కని గ్రామీణ నేపథ్యం, మంచి కుటుంబం, ఎలాంటి హడావిడి లేని కథ, కథనాలతో హాయిగా సినిమా చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌లో పాటలు, డాన్సులు, ఫైట్స్‌, ఊపిరి సలపని కామెడీని కోరుకునే ఆడియన్స్‌కి మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశం లేదు. కుటుంబ కథా చిత్రాలు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో కుటుంబ సమేతంగా సరదాగా చూడాలనుకుంటే ఈ సినిమాకి వెళ్ళొచ్చు.

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ : రాజుగారి పాత్ర పోషించిన రాజేంద్రప్రసాద్‌ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఊరి పెద్దగా, కుటుంబ పెద్దగా ఎంతో హుందాతనం వున్న ఆ క్యారెక్టర్‌ని అంతే హుందాగా తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. రాజుగారి మనవరాలు బంగారంగా బేబీ సారా అర్జున్‌ అందరి కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. మంచి ఎక్స్‌ప్రెషన్స్‌తో అన్నిరకాల ఎమోషన్స్‌ని పర్‌ఫెక్ట్‌గా చేసింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా పెర్‌ఫార్మ్‌ చేసి అందరి మనసులు దోచుకుంది. మిగతా క్యారెక్టర్ల విషయానికి వస్తే బావా మరదళ్ళుగా సిద్ధార్థ్‌వర్మ, నిత్యా శెట్టి చాలా క్యూట్‌గా వుండడమే కాకుండా కొన్ని సీన్స్‌లో చక్కని నటన ప్రదర్శించారు. జూనియర్‌ కలర్స్‌ స్వాతిగా అనిపించే నిత్యా శెట్టి అందర్నీ ఆకట్టుకుంది. రెండు సీన్స్‌లో కనిపించిన సత్యం రాజేష్‌, ఒకేఒక్క సీన్‌లో కనిపించిన జబర్దస్త్‌ శ్రీను కాసేపు నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా క్యారెక్టర్లు పోషించిన నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ : విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ని అందంగా చూపించడంలో కెమెరామెన్‌ జ్ఞానశేఖర్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. మూడ్‌కి తగినట్టుగా మంచి లైటింగ్స్‌తో సీన్‌ అద్భుతంగా రావడంలో కీలకపాత్ర పోషించాడు. ఇ.ఎస్‌.మూర్తి అందించిన సంగీతం బాగుంది. పాటలు ఇబ్బంది పెట్టేవిగా కాకుండా శ్రావ్యంగా వినిపించాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సిట్యుయేషన్స్‌కి తగినట్టుగా బాగా చేశారు. పల్లెటూరి వాతావరణాన్ని, రాజుగారి ఇంటిని అందంగా చూపించడంలో ఆర్ట్‌ డైరెక్టర్‌ సాహి సురేష్‌ కృషి కనిపిస్తుంది. డైరెక్టర్‌ విషయానికి వస్తే ఒక రీమేక్‌ సినిమాకి ఎలాంటి తప్పులు జరుగుతాయో అవి జరగకుండా చూడడంలో ఆర్‌.కె.మలినేని సక్సెస్‌ కాలేకపోయాడు. పల్లెటూరి వాతావరణాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీసుకురాగలిగాడు కానీ, సీన్స్‌గానీ, ఎమోషన్స్‌గానీ, ఫ్యామిలీ డ్రామాని గానీ ఒరిజినల్‌లో చూపించినంత బాగా తియ్యలేకపోయాడు. సీన్‌ వెనక సీన్‌ వస్తుందే తప్ప అందులో ఎలాంటి ఫీల్‌ కలగదు. అయితే ఆర్టిస్టుల నుంచి తను అనుకున్న పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడంలో మాత్రం సక్సెస్‌ అయ్యాడు. సినిమా చూస్తున్న ఆడియన్స్‌కి దాన్ని మించి ఇంకా ఏదో సినిమా వుండాలన్న ఫీల్‌ కలుగుతుంది. దాన్ని ఇవ్వడంలో విఫలమయ్యాడు. సినిమా రన్‌ టైమ్‌ రెండు గంటలే అయినా మూడు గంటల సినిమాగా అనిపించడానికి ముఖ్య కారణం రిపీటెడ్‌ సీన్స్‌. కథ చిన్నది కావడంతో దాన్ని రెండు గంటలు సాగదీయడానికి డైరెక్టర్‌ చాలా కష్టపడి కొన్ని అనవసరమైన సీన్స్‌ని ఇరికించాల్సి వచ్చింది. 

ప్లస్‌ పాయింట్స్‌ : 

చక్కని కుటుంబ కథ, 
కొన్ని సెంటిమెంట్‌ సీన్స్‌
కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌
రాజేంద్రప్రసాద్‌, సారా అర్జున్‌ పెర్‌ఫార్మెన్స్‌

మైనస్‌ పాయింట్‌ :

అనుకున్నంత ఎమోషన్‌ లేకపోవడం
ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అవడం
రిపీటెడ్‌ సీన్స్‌
రన్‌ టైమ్‌ తక్కువైనా పెద్ద సినిమాగా అనిపించడం

ఫినిషింగ్‌ టచ్‌ : ఈ ఆట లిమిటెడ్‌ ఆడియన్స్‌ కోసమే

మన తెలంగాణా వరల్డ్.కామ్ రేటింగ్ : 2.5/5

Tags: Dagudumootha Dandakor Movie Review | Dagudumootha Dandakor Movie Rating | Rajendra Prasad Dagudumootha Dandakor Movie Review | Movie Artist Association Presint Rajendra Prasad Dagudumootha Dandakor Movie Review | Dagudumootha Dandakor Movie online

« PREV
NEXT »

No comments

Post a Comment