తానేది చేసినా సరికొత్తగా ఉండాలనుకునే దర్శకుడు రాజమౌళి. తన సినిమాను ప్రమోట్ చేయడంలో రాజమౌళి ఎప్పుడూ వినూత్న పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. ‘బాహుబలి’ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ విడుదల కావడానికి ఇంకా ఒకరోజు ఉన్న విషయం తెలిసిందే! ఈలోగా బాహుబలి ట్రైలర్ ఏ రేంజ్లో ఉండనుందనేది తెలియజేయడానికి ఓ చిన్న సాంపిల్ నిన్న సాయంత్రం వదిలారు. ఆ టీజర్‌ను కూడా వినూత్నంగా విడుదల చేసిన రాజమౌళి, ట్రైలర్‌ను మరింత వినూత్నంగా విడుదల చేయనున్నారు.
రేపు (జూన్ 1న) ‘బాహుబలి ది బిగినింగ్’గా పిలవబడుతోన్న బాహుబలి మొదటిభాగానికి సంబంధించిన ట్రైలర్‌ను ముందుగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఉదయం 10:30 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఏర్పాటు చేసిన థియేటర్లలో ఆ సమయంలో ఎవరైనా వెళ్ళి ఉచితంగా ట్రైలర్‌ను చూడొచ్చు. ఇక సాయంత్రానికల్లా ట్రైలర్‌ను ఆన్లైన్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అంటే థియేటర్లలో ట్రైలర్ చూడబోయే వారు ఆన్లైన్ కంటే ముందే ట్రైలర్‌ను చూడాలంటే థియేటర్‌కి వెళ్ళాల్సిందే!
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలు విపరీతంగా పెంచేయగా, రేపటి ట్రైలర్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. తెలుగుతో పాటు హిందీలోనూ రేపే ట్రైలర్ విడుదల కానుంది. ఇక నిన్న విడుదలైన టీజర్ చూసినవారంతా బాహుబలి టీజర్ హాలీవుడ్ రేంజ్లో ఉందంటున్నారు. కేవలం ఐదారు షాట్స్ చూస్తేనే ఈ స్థాయి అనుభూతి కలిగితే ఇక సినిమా ఇంకెంత అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందోనని అభిమానులు సోషల్ మీడియోలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. టీజర్ పంచిన ఆనందంతో ఉత్సాహం మీదున్న ‘బాహుబలి’ అభిమానుల కళ్ళన్నీ రేపు విడుదలయ్యే ట్రైలర్‌పైనే.
No comments
Post a Comment