టాలీవుడ్లో ఆరడుగులకు పైనే పొడవు, అందుకు తగ్గట్టుగానే కండపుష్టి
కలిగిన హీరోల్లో రానా మొదటి స్థానంలో ఉంటారు. తన ఫిజిక్, యాక్టింగ్తో ఇటు
టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ
దేశమంతటికీ పరిచయస్థుడైపోయారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎంతో
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’లో రానా భల్లాలదేవగా
నటించిన విషయం తెలిసిందే.
గత కొన్ని రోజులుగా ‘బాహుబలి’ టీమ్ విడుదల చేస్తూ వస్తోన్న పోస్టర్ల
వరుసలో ఈ సాయంత్రం భల్లాల దేవగా నటించిన రానా పోస్టర్ విడుదలైంది.
భల్లాలదేవగా రానా అదిరిపోయే రేంజ్లో కనిపిస్తాడన్న విషయం ఈ పోస్టర్ చూస్తే
ఇట్టే తెలిసిపోతుంది. “ఎవరితోనూ పోల్చడానికి కూడా అందనంత బలశాలి, ఎవరూ
ఎదిరించలేనంత శక్తిమంతుడు, ఎవరి ఊహకూ అందని తెలివైనవాడు” అంటూ భల్లాల దేవ
గుణగుణాలను వర్ణిస్తూ రాజమౌళి ఈ పోస్టర్ను విడుదల చేశారు. ఎప్పట్లానే ఈ
పోస్టర్ కూడా సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్ అయింది.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని
ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్
నిర్మిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ల పరంపరలో చివరగా బాహుబలిగా నటించిన ప్రభాస్
పోస్టర్ మే 22న విడుదల కానుంది. ఎమ్. ఎమ్. కీరవాణి సంగీత దర్శకత్వంలో
రూపొందిన ఆడియో మే 31న విడుదల కానుండగా అదే రోజు ట్రైలర్ కూడా విడుదల
కానుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 10న
బాహుబలి మొదటి భాగం విడుదల కానుంది.
No comments
Post a Comment