Latest News

మాట త‌ప్పుతున్న స్టార్ హీరోలు
by MTW - 0


చెప్పిందేమిటి.. చేస్తున్న‌దేమిటి..? ఎప్పుడొస్తామ‌న్నారు.. ఎప్పుడొస్తున్నారు..? ఇటు ప్రేక్ష‌కుల్లో.. అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లే వేధిస్తున్నాయి. స‌మ్మ‌ర్ మొద‌ల‌య్యేదే ఆల‌స్యం.. ఎన్నో సినిమాలు కుప్ప‌లు తెప్పలుగా వ‌చ్చేస్తాయ‌ని అనుకున్నారంతా. అన్నీ ఒకేసారి వ‌స్తే థియేట‌ర్స్ ఎక్క‌డ స‌రిపోతాయ‌నే అనుమానాలు కూడా వ‌చ్చాయి. కానీ వేస‌వి మొద‌ల‌య్యే స‌రికి సీన్ మొత్తం మారిపోయింది. వ‌స్తాయ‌నుకున్న బ‌డా సినిమాల్లో.. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి మాత్రమే వ‌చ్చింది. అది కూడా చెప్పిన టైమ్ కు వారం ఆల‌స్యంగా.
ఇప్ప‌టికే రావాల్సిన ల‌య‌న్ మే 1కి వాయిదా ప‌డింది. ఇప్పుడు అది కూడా మే 7కి పోస్ట్ పోన్ అయింద‌ని స‌మాచారం. ఇక మే 7న రావాల్సిన కిక్ 2 కూడా వారం వెనక్కి వెళ్తోంది. ఎప్రిల్ లోనే వ‌చ్చేస్తాం అని చెప్పిన గుణ‌శేఖ‌ర్ రుద్ర‌మ‌దేవి జాడ ఇప్ప‌టివ‌ర‌కు ఇంకా క‌నిపించ‌డమే లేదు. మే 15న వ‌స్తాన‌ని చెప్పిన బాహుబ‌లి పార్ట్ 1పై ఇప్ప‌టికీ క్లారిటీ రాలేదు. ఈ సినిమా గ్రాఫిక్ వ‌ర్క్స్ ఆల‌స్యం కావ‌డంతో బాహుబ‌లి 1 జులైకి పోస్ట్ పోన్ అయింద‌నే వార్త‌లొస్తున్నాయి. ఇందులో నిజం కూడా లేక‌పోలేదు. మే 15 అంటే ఇంకా 20 రోజులే టైమ్ ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు చిన్న టీజ‌ర్ కూడా రిలీజ్ చేయ‌లేదు రాజ‌మౌళి. ప్ర‌మోష‌న్ కూడా మొదలుపెట్ట‌లేదు. ఇవ‌న్నీ చూస్తుంటే.. సినిమా జులైకి వెళ్లిపోయింద‌నే అనుమానం ప్రేక్ష‌కుల్లో కూడా క‌లుగుతుంది.
మ‌హేశ్ బాబు కూడా చెప్పిన టైమ్ కు రావ‌డం లేదు. ప్రస్తుతం ఈ హీరో న‌టిస్తోన్న శ్రీమంతుడు(వ‌ర్కింగ్ టైటిల్) మే లో వ‌స్తుంద‌ని ముందు చెప్పారు. కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు. అయితే షూటింగ్ లేట్ కావ‌డంతో జులై 17న మ‌హేశ్ రానున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మే 31న కృష్ణ బ‌ర్త్ డే సంద‌ర్భంగా శ్రీ‌మంతుడు టీజ‌ర్ రిలీజ్ చేస్తార‌ని స‌మాచారం. స‌మ్మ‌ర్ లో వ‌స్తాన‌ని చెప్పిన సోగ్గాడే చిన్నినాయ‌నా ఎప్పుడొస్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. ఇక లారెన్స్ గంగ కూడా ఎప్రిల్ 17 నుంచి 24కి వాయిదా ప‌డింది. ఇప్పుడు ఈ డేట్ కూడా మారి మే 1కి వెళ్లింద‌నే వార్త‌లొస్తున్నాయి. ఇలా మొత్తానికి మ‌న హీరోలు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోలేక ప్రేక్ష‌కుల‌ను మోసం చేస్తున్నారు.
« PREV
NEXT »